విశాఖపట్నం, సెప్టెంబరు, 26 (ది జర్నలిస్టు): ప్రయాణకాలాన్ని తగ్గించడమే కాకుండా, ఎక్కువమంది ప్రయాణించేలా రూపొందించిన గురువారం ఉదయ్ డబుల్ డెక్కర్ రైలు పట్టాలెక్కింది. విశాఖ నుంచి విజయవాడకు నడిచే డబుల్ డెక్కర్ ఏసీ రైలును రైల్వే సహాయ మంత్రి సురేష్ చన్నబసప్ప అంగడి అధికారికంగా ప్రారంభించారు. ఉదయం 11.30 గంటలకు విశాఖ రైల్వే స్టేషన్ ఒకటో నంబర్ ఎ:-లాట్ ఫాంపై రైలుకు పచ్చజెండా ఊపి ఆరంభించారు. గురువారం ఒక రోజు స్పెషల్ ఎక్స్ ప్రెస్గా ఇది నడుస్తుంది. శుక్రవారం నుంచి రెగ్యులర్ రైలుగా వారానికి ఐదురోజులు (ఆది, గురు వారం తప్ప) పరుగులు తీయనుంది. ఎన్నో ప్రత్యేకతలతో ప్రారంభమైన ఉదయ్ రైలుకు విశాఖ నుంచి విజయవాడకు టిక్కెట్ ధర 525 రూపాయిలగా నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు ఎంవివి సత్య నారాయణ, గొట్టేడి మాధవి, జీవీఎల్ నర్సింహారావు, రఘురామ కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.